Wednesday, October 30, 2013

విషాద సంచిక

                                       విషాద సంచిక

 పండగలకు ఊరు వెళ్లాలనుకుంటున్నారా? ట్రావెల్స్‌లో టికెట్స్ కూడా బుక్ చేయించారా..? అయితే జాగ్రత్త. బయలుదేరేముందు ఒక్కసారి మీ భద్రత గురించి ఆలోచించండి. 
 రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. అందులో 80శాతం ప్రైవేట్ వాహనాల ఖాతాలోనే చేరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రమాదాలన్నీ కలిపి రోజూ కనీసం అరడజను ముంది ఉసురుతీస్తుంటే... ప్రైవేటు ట్రావెల్స్‌ ఘటన జరిగిన ప్రతిసారి పది నుంచి 50మంది వరకూ మృత్యువాత పడుతున్నారు.
మొన్నటికి మొన్న.... షిర్డీ వెళ్తూ కాళేశ్వరి ట్రావెల్స్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో... అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. దిగ్బ్రాంతి కలిగించిన ఈ ఘటనలో ముప్పై మందికి పైగా మృత్యుఒడికి చేరారు. బతికి బట్టకట్టిన వారిలో కూడా చాలమంది శరీరఅవయవాలను కోల్పోవాల్సి వచ్చింది.
... ఈ విషాదం తాలూకు ఆనవాళ్లను పూర్తిగా మరచిపోకముందే మరో దారుణ ఉదంతం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న జబ్బర్‌ ట్రావెల్స్‌ బస్సు... నిట్టనిలువునా అగ్నికి ఆహుతైంది. 51మంది బస్సులో ఉంటే... 45మందిని సజీవం దహనం చేసింది. బతికినవాళ్లలో డ్రైవర్‌, క్లీనర్‌ సహా.. మరో నలుగురు ముందు కాబిన్‌లో ఉన్నవాళ్లే.
                                                                         అసలు, ఈ ఘటనకు కారణాలేంటి?
 అరకొర ప్రమాదాలు తగలపడుతున్న జబ్బర్‌ ట్రావెల్స్‌ బస్సు
తప్పితే, వందలమందిని ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంటే... ప్రైవేటు ట్రావెల్స్‌లో వెళ్లేవారికి మాత్రం ఈ గతేంటి? ఇప్పుడిదే ప్రశ్న. వాస్తవానికి ఆర్టీసీతో పోల్చితే ప్రైవేటు వాహనాలకు డబ్బు ఆశ అధికం. ఇదే కొంప ముంచుతోంది. పర్మిట్‌ లేని రూట్లలో, ఫిట్‌నెస్‌ లేని బస్సులు రోడ్డెక్కి మారణహోమం సృష్టిస్తున్నాయి. సాధారణంగా పదుల సంఖ్యలో ప్రయాణికులను ఓ బస్సు మోసుకెళ్తుందంటే... ఆ డ్రైవర్‌ ఎంతో సాహసం చేస్తున్నట్లే లెక్క. వారందరూ తమ ప్రాణాలను నమ్మకంగా  డ్రైవర్‌ చేతిలో పెట్టినట్టే. అలాంటి సారథి ఎలా ఉండాలి. ?
..సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో అయితే, వాహన చోదకులకు శిక్షణ ఉంటుంది. అసలు ప్రమాదం జరగకుండా పాటించాల్సిన నియమనిబంధలు వాళ్లకు కొట్టినపిండి. ఆయనా ఒకటీరెండు సార్లు నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరగొచ్చు. ఒకవేళ అలా జరిగినా... చివరి క్షణం వరకూ ప్రయాణికులను కాపాడలన్న లక్ష్యం వారికి శిక్షణతో పెట్టిన విద్య.
ఇక ప్రైవేటు ట్రావెల్స్ అయితే, డ్రైవర్‌కు లైసెన్స్‌ ఉంటే చాలన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఎంత దూరమైనా ఒక్కడే డ్రైవర్‌తో సాగనంపుతున్నాయి. గమ్యాన్ని చేరాలన్న లక్ష్యం తప్పితే, వేగం-దాని పర్యవసానాలతో పనిలేదు. తాజా ఉదంతం అదే నిరూపించింది. అతివేగంతో కల్వర్టును డీకొట్టి.. డీజిల్‌ ట్యాంక్‌ పేలడానికి నిర్లక్ష్యమే కారణమైంది. పోనీ ప్రమాదం జరగ్గానే.. వెనకాల ప్రయాణికులున్నారన్న సంగతి గుర్తుపెట్టుకుని , కనీసం... బయటికొచ్చేందుకు డోర్‌ ఓపెన్ చేయాలన్న ఆలోచన కూడా వారి బుర్రలకు తట్టలేదు.  ఆ ఫలితమే... 45మంది ప్రాణాలు.
బస్సు అందాలు, సౌకర్యంతో పాటు... త్వరగా చేరతామన్న ప్రయాణికుల ఆశ... అతి త్వరగా అనంతలోకాలకు పంపుతోంది. సాధారణంగా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు డొక్కు బస్సులు సైతం రోడ్లెక్కుతున్నాయి. డబుల్‌ చార్జీలతో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రమాదాలు జరిగే... నష్టం రెండింతలుండడం ఖాయం.
మరి ట్రావెల్స్‌ మాఫియాగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్న అనుమానం రావచ్చు. నిజానికి ట్రావెల్స్ నడుపుతున్న వారిలో సగం మంది రాజకీయ వేత్తలే. లేదంటే వారి బంధువులు, అనుచరలే. దీంతో ఒత్తిళ్లు పెరిగి అధికారులూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఘటన జరిగిన ప్రతిసారి మెరుపుదాడులు చేసి బస్సులను సీజ్‌ చేసినా.. మీడియాలో వార్తలు వచ్చిపోగానే.. బస్సులూ విడుదలవుతాయి.
గతంలో రవాణాశాఖ కమిషనర్‌గా పూనం మాలకొండయ్య ఉన్నప్పుడు ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆమె ఉక్కుపాదమే మోపారు. అప్పట్లో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఏకంగా ఆమె కార్యాలయానికే వచ్చి దుర్భాషలాడారు. ఆయన చెక్కుచెదరక తనపనిని తాను చేసుకుంటూ పోయారు పూనం. బెదిరింపులతో పని జరగదని తెలుసుకున్న ట్రావెల్స్‌ మాఫియా... ఆమెను ఆ స్థానం నుంచి బదిలీ అయ్యేలా చేసింది...
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఘటనకు సంతాపం చెప్పడం తప్ప, ట్రావెల్స్‌ ను కట్టడి చేయడం సర్కారుకు చేతగాని పని. కాబట్టి... ప్రయాణికులే సొంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళి వేళ... ఇతర సమయాల్లో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే చికిత్స కంటే నివారణే మేలన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.

No comments:

Post a Comment