Wednesday, October 30, 2013

అఖిలపక్షం.. అశనిపాతమే... !

                                అఖిలపక్షం.. అశనిపాతమే


రాష్ట్రంలో కొత్త రాజకీయ వాతావరణానికి కేంద్రం తలుపులు తీసింది. మరోసారి తెలంగాణ రాష్ట్రంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాన్ని గుర్తుచేసింది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఇరకాటంలో పెట్టేందుకే కాంగ్రెసు అధిష్టానం సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందా లేదంటే రాజకీయ ప్రయోజనాలు కానరాని పరిస్థితుల్లో విభజన ప్రక్రియను సాగదీస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం... అనూహ్యంగా ఓ ట్విస్ట్‌ ఇచ్చింది.  మరోసారి అఖిల పక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర విభజన కోసం ఉద్దేశించిన 11 విధి విధానాలపై రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీల నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకోవాలని యోచిస్తోంది . అయితే, ఈ నిర్ణయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంత వ్యతిరేకత ఓవైపు, రంగుమార్చిన పార్టీల నైజం మరోవైపు కనిపిస్తుండడంతో రాజకీయ ప్రయోజనాలు ఆశించినంతగా ఉండవనే విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తించింది. ముఖ్యమంత్రి సహా కీలకంగా ఉన్న సొంత పార్టీ నేతల మెడపైనే కత్తిపెట్టి తెలంగాణా ఇవ్వడం వల్ల ఒరిగే లాభాలేమని పసిగట్టిన కాంగ్రెస్‌.. వైసీపీపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్ల కనిపిస్తోంది. మొన్నటికి మొన్న సమైక్య సభలో జగన్‌.. మాటతీరు సోనియాపై ఉన్న వ్యతిరేకతను కళ్లకుగట్టింది. ఇటు తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ కూడా విలీనంపై మాట దాటేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు కుదరకపోయే అవకాశం సుస్ఫష్టం. ఒకవేళ జతకలిసినా... అది పక్కలోబల్లమే. దీంతో తెలంగాణాను ఇస్తామనే మాట చెబుతూనే, ప్రక్రియను సాగదీసే పనిలో పడింది కేంద్రం.


ఇక తాజా అఖిలపక్ష నిర్ణయంతో వైసీపీ, టీడీపీల పరిస్థితి ఇరకాటంలో పడింది. మొదట్నుంచి సమైక్య రాగం వినిపిస్తున్న వైసీపీ ... ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై చర్చలు ప్రారంభించింది. వైయస్ జగన్ వినిపిస్తున్న సమైక్యవాదంలో పెద్ద లొసుగే ఉంది. మొదట సమన్యాయం అని, ఆ తర్వాత సమైక్యవాదమని చాటిన జగన్‌ ఇప్పుడు సమైక్య రాష్ట్రమే ఉన్నా కూడా తెలంగాణాని వదులుకుంటారా అనేది తేలాల్సిన విషయం. మరోమాటలో చెప్పాలంటే... సమైక్య ముసుగులో సీమాంధ్రకు గాలం వేసిన జగన్‌కు అఖిల పక్షం అశనిపాతమే.


ఇక టీడీపీకైతే కేంద్ర నిర్ణయం కోలుకోలేని దెబ్బ. విభజనపై ఏం మాట్లాడాలో తెలియక మొదట్నుంచి విభజన తీరును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తాజా బేటీలో కచ్చిత వైఖరి కనబరచాల్సి ఉంది. ఓవైపు గతంలో ఇచ్చిన విభజన అనుకూల లేఖ, మరోవైపు సీమాంధ్ర సెగ... వెరసి, టీడీపీకి ఇప్పుడిది తేలని సమస్య.
తెలంగాణను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం లేఖలు ఇస్తే తెలంగాణలో ఆ పార్టీలకు ఏ మాత్రం చోటు ఉండదు. ఆ విషయం తెలిసిన ఆ పార్టీల అధినేతలు అటువంటి సాహసానికి ఒడిగట్టకపోవచ్చునని అంటున్నారు. అయితే, సమైక్యాంధ్ర కోసం జగన్ లేఖ ఇస్తారేమో గానీ చంద్రబాబు మాత్రం ఇచ్చే అవకాశాలు లేవు. జగన్ కూడా సమన్యాయం షరతు పెట్టి మాత్రమే లేఖ ఇచ్చే అవకాశమూ లేదన్నది విశ్లేషకుల భావన.  

                                                                            - రాజేష్ పొట్లూరి

No comments:

Post a Comment