Wednesday, August 14, 2013

తెలుగు తల్లికి తెలంగాణా తల్లికి పడదా?

               తెలుగు తల్లికి తెలంగాణా తల్లికి పడదా?    

అవసరాల రీత్యా, అభివృద్ధి దృష్ట్యా ప్రాంతాలు  విడిపోవచ్చు. మానవ సంబంధాలకు భౌగోళిక సరిహద్దులు అడ్డుకాబోవు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు సృష్టించే విబేధాలకు ప్రజల బలికాకూడదు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా వాదం లోనూ అదే కనిపిస్తుంది. నీళ్లు, నిధులు, నియాకమాల్లో అవకతవల కారణంగా, ఇన్నేళ్లూ అన్యాయం జరిగిందని భావించిన తెలంగాణా వాసులు, తమ కాంక్షను బయటపెట్టడంలో తప్పులేదు. ప్రత్యేక రాష్ట్రంగా అవిర్భవించడంలోనూ తప్పులేదు. తెలంగాణా ప్రజలు కోరుకునేది ఏపీ నుంచి విముక్తి కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ అవతరణను బ్లాక్‌డే భావించి, ఆ రోజును సెలబ్రేట్ చేసుకోకపోవచ్చు. అది వారి అభిమతం.

కానీ, సోదరుల్లా విడిపోతే అమ్మ మారుతుందా?

తెలంగాణా , రాయలసీమ , ఉత్తరాంధ్ర, ఆంధ్ర.. యాసలు ఎన్ని ఉన్నా, అన్నింటికీ మూలమైన భాష మాత్రం తెలుగే.
తెలుగు తియ్యదనాన్ని తెలుగునేల గొప్పదనాన్నీ కీర్తించే "తెలుగుతల్లి"కి ితెలంగాణా వ్యతిరేకమా? వారు మాట్లాడేది తెలుగు భాష కాదా? తెలుగు భాషే అయినప్పుడు దాన్ని తెలంగాణాలో  బ్యాన్‌ చేయాలన్న ఆలోచన మూర్ఖత్వం కాదా...??

నిజానికి ఒకప్పుడు “నమో ఆంద్ర మాతా … మాతా నమో దివ్య తేజా ..” అనే పాట మారు మ్రోగేది. చాలా నాటక సమాజాల వాళ్లు తమ నాటకం మొదలు పెట్టేముందు ఆ పాట ను ఆలపించేవారు.  దానిని ఎవరు రాసారో కూడా తెలియదు. కానీ,  శంకరం బాడి సుందరాచారి తెలుగు తల్లి పాట వచ్చిన తర్వాత “నమో ఆంద్ర మాతా …”
పాట ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. తెలుగు భాషాభిమానం, తెలుగునాడు గొప్పదనంతోనే మా తెలుగు తల్లి అక్షర రూపం సంతరించుకుంది. 

సోదరుల్లా విడిపోవడంలో తప్పులేదని చెబుతున్న వారు, తల్లిని కూడా మారుస్తారా? తల్లిపేరునూ మారుస్తారా? అంతెందుకు "మాతెలుగు తల్లికి మల్లెపూదండ" ఆలపించడంలో తప్పేముంది. ఏ భాషకూలేని తల్లి మనకుంది కదా దాన్ని కనీసం భాషాభిమానంతోనైనా అంగీకరించొచ్చు కదా.

జైతెలుగుతల్లి

మాతెలుగు తల్లికి మల్లెపూదండ.....

మాతెలుగు తల్లికీ మల్లెపూదండ
మాకన్నతల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
గల గల గోదారి కడలి పోతుంటేను
బిర బిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలిచి ఉండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మాచెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెలుగుతల్లి ! జై తెలుగుతల్లి !
................... తెలుగువారుండే నేలను గౌరవిస్తూ తెలుగు తల్లి అని ప్రేమగా పిలుచుకోవడమే గానీ, ఆంధ్రప్రదేశ్ తల్లి అని ఎక్కడా లేదు కదా! ఇందులో కనిపిస్తున్న కృష్ణమ్మ తెలంగాణాలోనూ బిరబిరా పారుతుంది, గలగలా గోదారి తెలంగాణాలోనూ పరుగులిడుతుంది. వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన రుద్రమ్మ... ఓరుగల్లు ముద్దుబిడ్డే.
అలాంటప్పుడు, ప్రత్యేకించి తెలంగాణా తల్లి సృష్టిలో అర్థం ఏముంది. పోనీ, తెలంగాణాగడ్డకు సంబంధించిన పాటే అనుకుంటే, మా తెలుగు తల్లికి మల్లెఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో, విదేశంలో ఉన్నా... తెలుగు నేలపై పుట్టినవాడు, తెలుగు భాషను నేర్చినవాడు, తెలుగు తల్లినే అమ్మగా భావించడంలో తప్చ్చుపుందా? ఉంది.. అంటే అది అజ్ఞానమో, శత్రుత్వ భావజాలమో అవ్వదా? తెలంగాణా తల్లికి తెలుగుతల్లి శత్రువా? కాదు కదా! 
పూదండ ఆలపించొద్దన్న హుకుం ఎందుకు? 
భౌగోళికంగా ఉండే ప్రాంతీయాభిమానం వేరు వేరు, భాషాభిమానం వేరు. వేర్పాటు వాదంతో అభివృద్ధిని, ఐడెంటీనీ కొరుకోవచ్చుగానీ... మూలాలతో కూడా తెగదెంపులు చేసుకుంటే అది విద్వేషపూరితమే గానీ, అభివృద్ధి కాంక్ష కాదు. 
ఇతర భాషలకు తల్లులు ఉన్నారో లేదో తెలీదుగానీ, మన భాషకంటూ ఉన్న తెలుగుతల్లి ఉంది. ఆమెను పూజించకపోయినా ఫర్వాలేదు. గౌరవిద్దాం. సోదరుల్లా విడిపోయినా అమ్మను, ఆమె నేర్పిన భాషను గౌరవిద్దాం.  తెలంగాణాలో తెలుగుతల్లి పాటను బ్యాన్‌ చేయమన్నవారి అజ్ఞానాన్ని పారద్రోలదాం.

(ఇంతరాయడం చూసి ఓ మిత్రుడు, మీరు సమైక్యవాదా అని అడిగాడు. నేను, సమైక్యవాదినీకాదు, తెలంగాణా వాదినీ కాదు. అభివృద్ధి కాంక్షకుడిని మాత్రమే. ప్రాంతాలు వేరైనా, అందరం ఒక్కటే. తమిళనాడులో లేకపోయినా కేవలం తమిళం మాట్లాడతారన్న అభిమానంతో శ్రీలంకలోని తమిళీయులను కూడా తమిళనాడు వాళ్లు కంటికిరెప్పలా చూసుకోవాలని తాపత్రయపడతారు. అలాంటి భాషాభిమానం మనకూ అవసరమే అన్న భావనతో పెట్టిన ఆర్టికిల్) -  Rajesh Potluri

2 comments:

  1. తెలుగు భాష మీది అభిమానానికి నా జోహార్లు ...అయితే కాలే కడుపు అన్నం కోసం ఎదురు చూస్తుంది కానీ ప్రాసల కోసం కాదు.. అంగ బలం అర్థ బలం ఒక మాండలికం ... నియంత రాజుల కింద ... రాక్షస దొర తనం కింద.. ఎదురుగ నీళ్ళు ఉంది .. తదారని గొంతులులతో .. కాపాడుకున్నా మాండలికాన్ని .. మరో మాండలికం ఎగతాళి చేయడం .. సినిమాల్లో వంగ్యనికి వాడటం.. ఆఫీసుల్లో వెధవ జోకులేయటం .. సవతి తల్లి ప్రేమ లాగానే ఉంటుంది.. సవతి తల్లులందరినీ రాక్షసులగా చూపించే .. బంగారు కడియాలు .. గండ పెన్న్దేరాలు(గండ బెరుండలు) .. విలస బతుకలతో ... అవతలి వైపు సో కాల్డ్ కవులకు .. భాషాభిమానులకు .. బాధ కలుగొచ్చు .. కానీ ... మాకు తల్లే లేదు.. అనాథలం అనుకుంటున్నప్పుడు.. మాకు ఓ తల్లి ఉందని.. దాని భాష .. ఆచారాలు.. అలవాట్లు.. సంస్కృతి.. అత్యాచారానికి గురి అవుతుందంటే .. మాకు ఎంత బాధ(కాలుద్ది) కలుగుతుంది...

    ReplyDelete